ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా మస్క్‌.. ఆయన సంపద భారత జీడీపీలో నాలుగో వంతు!

  • 1.1 ట్రిలియన్‌ డాలర్లకు చేరిన సంపద
  • స్పేస్‌ఎక్స్‌ ఐపీఓతో సంపదలో భారీ పెరుగుదల
  • తైవాన్‌ జీడీపీ కంటే ఎక్కువ ఆస్తులు
  • స్పేస్‌ఎక్స్‌ వాటా విలువే 866 బిలియన్‌ డాలర్లు
  • ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్‌ అగ్రస్థానం
ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మరో అరుదైన రికార్డు సృష్టించారు. 1 ట్రిలియన్‌ డాలర్లకు పైగా వ్యక్తిగత సంపద కలిగిన తొలి వ్యక్తిగా నిలిచారు. స్పేస్‌ఎక్స్‌ ఐపీఓ విజయవంతం కావడంతో మస్క్‌ సంపద భారీగా పెరిగింది. ప్రస్తుతం ఆయన నికర ఆస్తుల విలువ 1.1 ట్రిలియన్‌ డాలర్లను (రూ.94.6 లక్షల కోట్లు) దాటనున్నట్లు అంచనాలు చెబుతున్నాయి.

స్పేస్‌ఎక్స్‌ షేర్లు మార్కెట్లోకి రావడంతో మస్క్‌ సంపదలో ఒక్కసారిగా భారీ పెరుగుదల నమోదైంది. ఐపీఓకు ముందు ఆయన సంపద సుమారు 780 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. ఇప్పుడు స్పేస్‌ఎక్స్‌లోని వాటా విలువ ఒక్కటే 866 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు తెలుస్తోంది. టెస్లా, ఇతర కంపెనీల్లోని వాటాలను కలుపుకొంటే మొత్తం సంపద 1.1 ట్రిలియన్‌ డాలర్లను దాటుతోంది.

ఈ స్థాయిలో సంపద కలిగిన వ్యక్తి ఇప్పటివరకు లేరు. స్పేస్‌ఎక్స్‌ ఐపీఓకు ముందు కూడా మస్క్‌ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఆయన సంపద దాదాపు 971 బిలియన్‌ డాలర్లుగా ఉండేది. రెండో స్థానంలో ఉన్న గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్‌ సంపద సుమారు 304 బిలియన్‌ డాలర్లు మాత్రమే

మస్క్‌ సంపద ఇప్పుడు కొన్ని దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థలనే దాటిపోవడం విశేషం. అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనాల ప్రకారం తైవాన్‌ జీడీపీ విలువ 976.7 బిలియన్‌ డాలర్లు. 
ప్రస్తుతం భారత జీడీపీ సుమారు 4.15 ట్రిలియన్‌ డాలర్లని (రూ.356.9 లక్షల కోట్లు) అంచనా. అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థలో దాదాపు నాలుగో వంతుకు సమానమైన సంపద ఒక్క మస్క్‌ వద్దే ఉంది.

1971లో దక్షిణాఫ్రికాలో జన్మించిన ఎలాన్‌ మస్క్‌ గత మూడు దశాబ్దాల్లో ప్రపంచ వ్యాపార రంగాన్ని ప్రభావితం చేసిన వ్యక్తిగా ఎదిగారు. టెస్లా ద్వారా ఎలక్ట్రిక్‌ వాహనాలకు కొత్త దిశ చూపించారు. స్పేస్‌ఎక్స్‌తో అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. న్యూరాలింక్‌, బోరింగ్‌ కంపెనీ వంటి సంస్థలను కూడా స్థాపించారు. 2022లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసి దానికి ‘ఎక్స్‌’గా పేరు మార్చిన సంగతి తెలిసిందే.

మస్క్‌ కంపెనీలకు పెట్టుబడిదారులు ఇస్తున్న ప్రత్యేక విలువను మార్కెట్‌ విశ్లేషకులు ‘ఎలాన్‌ ప్రీమియం’గా అభివర్ణిస్తున్నారు. ఆయన ఆలోచనలు, వ్యాపార దూకుడు, భవిష్యత్‌పై పెట్టే భారీ పందేలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని చెబుతున్నారు. అందుకే సంప్రదాయ విలువల లెక్కలకు మించి ఆయన కంపెనీలకు మార్కెట్‌లో భారీ విలువ లభిస్తోందని విశ్లేషిస్తున్నారు.

Elon Musk
World first trillionaire
SpaceX IPO
India GDP
Tesla
Net worth

More Telugu News